మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు
మేడారం జాతరకు ప్రత్యేకంగా 4,000 ప్రత్యేక బస్సులు
జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ సర్వీసులు
20 లక్షల మంది భక్తుల తరలింపే లక్ష్యం
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగింపు
కాకతీయ, ములుగు ప్రతినిధి : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని, ఈ వెసులుబాటుతో ఈసారి జాతరకు మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2026 మేడారం జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులను తరలించేందుకు టీఎస్‌ఆర్‌టీసీ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 4,000 ప్రత్యేక బస్సులను జాతరకు కేటాయించారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టేషన్లు, క్యూలైన్లు, వేచి ఉండే షెడ్లు, విస్తృత పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎండ, వర్షం నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు స్పష్టం చేశారు.
10 వేల మందికి పైగా సిబ్బంది విధుల్లో
జాతర నిర్వహణ కోసం 10,000 మందికి పైగా టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. బస్సుల కదలికలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, సౌకర్యాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాలతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. జాతర రోజుల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బస్సుల రాకపోకలను క్షణక్షణం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు బస్సులు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మేడారం జాతర నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మొత్తంగా మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే టీఎస్‌ఆర్‌టీసీ లక్ష్యం అని అధికారులు స్పష్టం చేశారు.


