కేసముద్రంలో హోరాహోరీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో ప్రతిష్టాత్మకం
రిజర్వేషన్లు అనుకూలించక లీడర్ల నారాజ్
చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు కేటాయించడంతో నిరాశ
పట్టణంలో రెండు శిబిరాలుగా అధికార పార్టీ
వేం.. మురళీనాయక్ వర్గాల మధ్య ఆధిపత్యం
సన్నాహక సమావేశాలు సైతం వేర్వేరుగానే..
బీఆర్ఎస్‌కు కలిసి రానున్న కాంగ్రెస్ వర్గపోరు ?
వ్యూహాలకు పదునుపెడుతున్న కవిత, శంకర్‌నాయక్
సత్తా చాటేందుకు బీజేపీ, స్వతంత్రులు సిద్ధం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పురపోరు ఉత్కంఠ రేపుతోంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. నోటిఫికేషన్ రాకముందే ఇప్పటికే ప్రచారంలోకి దూకిన నేతలు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎవరికి వారుగా వ్యూహాలు రచిస్తున్నారు. పట్ణణ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 వార్డులున్న కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ పదవి తొలిసారి ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. దీంతో చైర్మన్‌పీఠంపై ఆశలు పెట్టుకున్న కీలక లీడర్లకు నిరాశే ఎదురైంది. ఇక వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకొని ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఇతర వార్డుల నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలతో ప్రచారం మొదలుపెట్టడంతో పట్ణణ రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది.

కాంగ్రెస్‌లో గ్రూప్ వార్
అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సలహాదారు, సీనియర్ నేత వేం నరేందర్‌రెడ్డి సొంత మండలం కావడంతో కేసముద్రం రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పదవులతోపాటు, నామినేటెడ్ పోస్టుల్లోనూ కీరోల్ ప్లే చేస్తున్నారనే టాక్ ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు కూడా తెలియకుండా కొన్ని కీలక నిర్ణయాలు జరిగిపోతుండటం మురళీనాయక్‌కు రుచించడంలేదు. నియోజకర్గంతోపాటు ముఖ్యంగా కేసముద్రంలో వేం అనుచురులు అన్నీతామై వ్యవహరిస్తుండటంతో పార్టీ ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయింది. కేసముద్రం మార్కెట్ చైర్మన్ పదవి విషయంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు సైతం ఈ రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించుకుంటుండటం గమనార్హం. అధికార పార్టీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు కేడర్‌ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కాగా.. ధనసరి ఉప సర్పచ్, కాంగ్రెస్ నేత బానోత్ వెంకన్న సతీమణి పేరు చైర్మన్ రేసులో ప్రస్తుతానానికి ప్రచారంలో ఉంది. నోటిఫికేషన్, నామినేషన్ల సమయానికి మరికొందరు పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
కవిత, శంకర్‌నాయక్ వ్యూహాలు..
అధికార పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. కేసముద్రం మున్సిపల్ చైర్మన్ పీఠంపై కన్నేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గెలిచి తీరాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్మన్ రేసులో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ హరీష్ నాయక్ సతీమణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షడు గుగులోత్ వీరునాయక్ భార్య (మాజీ ఎంపీటీసీ) పేర్లు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తధ్యమని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇక బీజేపీతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండటంతో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారుతోంది.
చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్
2025 జనవరిలో మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడింది. స్టేషన్ కేసముద్రం, విలేజ్ కేసముద్రం, అమినాపురం, ధనసరి, సబ్‌స్టేషన్ తండా గ్రామాలు ఈ కొత్త మున్సిపాలిటీలో భాగమయ్యాయి. దీంతో మేజర్ పంచాయతీగా ఉన్న కేసముద్రం పట్టణ ప్రాంతంగా అవతరించింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం సుమారు 20 వేల జనాభా ఉంది. 1980 వరకు ఉమ్మడి గ్రామంగా ఉండేది. 1981లో స్టేషన్, విలేజ్ కేసముద్రంలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దాదాపు 43 ఏండ్ల తర్వాత మున్సిపాలిటీతో ఈ రెండు గ్రామాలు మళ్లీ ఒక్కటయ్యాయి. కేసముద్రం మున్సిపాలిటీతో ఐదు గ్రామాలకు సర్పంచ్‌లతోపాటు, 56 వార్డు సభ్యులు, 6 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కొత్తగా ఆయా గ్రామాల్లోని 16 వార్డులతో కేసముద్రం మున్సిపాలిటీ అవతరించింది. కేసముద్రం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ జనరల్ అవుతుందని గంపెడాశతో ఎదురుచూసిన నేతలకు షాక్ తగిలినట్లయింది. ఎస్టీ మహిళకు కేటాయించడంతో ముఖ్య నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.


