కాకతీయ ఎఫెక్ట్..!
చెత్త డ్యూటీకి చీవాట్లు!
బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆగ్రహం
బాలసముద్రంలోని ట్రాన్స్ఫర్ స్టేషను సందర్శించిన అధికారిణి
కాకతీయ కథనంపై స్పందించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్

కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం కాకతీయ దినపత్రిక ప్రచురితమైన ‘చెత్త డ్యూటీ’ కథనాన్ని కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. ఉదయమే హన్మకొండ బాల సముద్రంలోని వెహికిల్ షెడ్, చెత్త ట్రాన్స్ఫర్ స్టేషను సందర్శించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు ఎందుకు తరలించడం లేదని అధికారులను ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మందలించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లో పార్కింగ్ ఏరియా ను అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వాహనాల మరమ్మతులలో వేగం పెంచాలని, వెహికల్ షెడ్ లో గల స్థలంలో వాహనాలను నిలపడానికి పార్కింగ్ ఏరియాను అభివృద్ధి చేయాలన్నారు. వాహనాలు మరమ్మతులు చేయడానికి కొంత స్థలాన్ని కేటాయించి రిపేరింగ్ లు వేగంగా జరిగేలా చూడాలని సూచించారు. షెడ్ లో చెత్తను సోర్స్ సెగ్రిగేషన్ జరిగేలా చూడాలని మరమత్తుల కోసం షెడ్ కు వచ్చిన వాహనాల రిపేరింగ్ లో జాప్యం లేకుండా వెంటనే మరమత్తులు పూర్తి చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవి లత, మహేందర్, డిఈలు కార్తీక్, రాజ్ కుమార్, శ్రీకాంత్, సానిటరీ సూపర్వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


