ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు చేపట్టిన లక్ష్మణుడు
కాకతీయ, వరంగల్ : మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్న ఆర్. లక్ష్మణుడు గురువారం వరంగల్ ఆర్ జేడీఎంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఇక్కడ పనిచేసిన వి శ్రీనివాస్ ను డెప్యూటేషన్ పై హైదరాబాద్ వ్యవసాయ శాఖ (ఎఫ్ పి వో)గా నియమించారు. కాగా ఆర్జేడీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్ష్మణుడు డిడిఎం పద్మావతి, డిఎంఓ సురేఖతో కలిసి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ లోని పల్లి, పసుపు, మిర్చి, పత్తి, అపరాల యార్డులను పరిశీలించారు. పల్లి యార్డులో మట్టిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మిర్చి యార్డులో నిలిచిన నీటిని తొలగించి, మరోసారి నిలవకుండా చూడాలని తెలిపారు. పత్తి యార్డులో గల అన్నపూర్ణ క్యాంటీన్ ను పరిశీలించిన ఆయన పైకప్పుకు వేలాడుతున్న బూజును చూసి అసహనం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని మంచి పెయింట్ వేయించాలని ఆదేశించారు. అపరాల యార్డు సమీపంలో వ్యాపారుల కోసం కడుతున్న షట్టరూంలు అర్ధాంతరంగా ఆగి ఉండడం చూసి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అట్టి గదులు కాంట్రాక్టర్ పూర్తి చేస్తాడా.. లేదా.. అడిగి చెప్పాలని, పూర్తి చేయడానికి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయాలని మార్కెట్ డిఈని మందలించారు. అలాగే మార్కెట్ లో రైతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను సందర్శించి పలు రకాల మందులను (టాబ్లెట్స్) పరిశీలించారు. అనంతరం మార్కెట్ లో అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం, గ్రేడ్ 2 కార్యదర్శులు శ్రీ రామోజు రాము, అంజిత్ రావు, ఏఎస్ లు రాజేందర్, అశోక్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.


