బ్లాక్ స్పాట్స్‌పై పకడ్బందీ చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం
ట్రాఫిక్ రూల్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రత కమిటీ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రోడ్లు భవనాలు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.కరీంనగర్–జగిత్యాల రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల మేర చదును చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్, వాటి నివారణ చర్యలను వివరించారు.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరంలో అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సోలార్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ జాతీయ రహదారి 563లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డీఎం సునంద, ఏసీపీ వెంకటస్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


