19వ డివిజన్ రేసులో వేన్నం రజితా రెడ్డి
కాంగ్రెస్ టికెట్ కోసం బరిలోకి మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ (రేకుర్తి) కార్పొరేటర్ స్థానం జనరల్ మహిళా కేటగిరీగా ఖరారవడంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేన్నం రజితా రెడ్డి పోటీలో నిలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన రజితా రెడ్డి, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ జిల్లా స్థాయి నాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతకు తగినట్టుగానే ఆమె పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పనిచేశారు.సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతూ అనేక మంది మహిళా కార్యకర్తలను తీర్చిదిద్దిన రజితా రెడ్డి, పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు మహిళా కాంగ్రెస్‌కు పటిష్ట బలం చేకూర్చారు. మహిళల హక్కులు, సంక్షేమ అంశాలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
రేకుర్తి డివిజన్‌లో ప్రజల సమస్యలపై స్పందిస్తూ ముందుండే నాయకురాలిగా రజితా రెడ్డికి మంచి పేరు ఉంది. స్థానిక సమస్యలపై ఆమె చూపిస్తున్న చొరవకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి ఆమెకు బలమైన మద్దతు వ్యక్తమవుతోంది. డివిజన్ అభివృద్ధికి ఆమెలాంటి సేవాభావం కలిగిన నాయకత్వం అవసరమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ వేన్నం రజితా రెడ్డికే కేటాయిస్తే, భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రేకుర్తి ప్రజలు కూడా ఆమె గెలుపు ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు.


