రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీ
కాకతీయ, కరీంనగర్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కరీంనగర్ లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వాకర్లు, విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలన్నారు. బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం చట్టవిరుద్ధమని, ప్రాణాంతకమని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగుతుందని తెలిపారు. వయస్సు నిండని పిల్లలకు వాహనాలు అప్పగించకూడదన్నారు. అధిక వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అనంతరం రోడ్డు నిబంధనలు పాటిస్తామని, ఇతరులకు అవగాహన కల్పిస్తామని, ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేస్తామని విద్యార్థులు, వాకర్లతో పోలీసులు ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో లేక్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఆర్ఎస్ఐ రమేష్, ఇతర పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు


