కేటీఆర్‌కు నోటీసులు
రేపు ఉదయం 11 గంటలకు విచారణ
ఇప్పటికే హరీశ్‌రావును విచారించిన అధికారులు
త్వరలోనే కేసీఆర్‌కు పిలుపు?
తుది దశకు చేరుకుంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !
మరింత దూకుడు పెంచిన సిట్
ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు నార్సింగి ఆలీవ్ విల్లాస్లోని కేటీఆర్ నివాసంలో సిట్ అధికారులు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా అక్కడ నోటీసులు తీసుకోకపోవడంతో నందినగర్‌లోని నివాసంలో అందించారు. కాగా.. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం.. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అటు హరీష్ రావును కూడా మరోసారి సిట్ విచారణకు పిలవవచ్చని సమాచారం. ఇదే కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా విచారించేందుకు నోటీసులు జారీ చేస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆరోపణలను తోసిపుచ్చిన కేటీఆర్
గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పలుమార్లు కేటీఆర్ పేరు వినిపించింది. సినీ హీరోయిన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరోపణలు చేశారు. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసు మాదిరిగానే ఇదోక లొట్టపీసు కేసు అని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా సిట్ పేరుతో ఆడుతున్న డ్రామా అని ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. హరీష్ రావు ను సిట్ విచారణకు పిలిచిన సందర్భంలోనూ కేటీఆర్ ఇదే వాదనను వినిపించారు. ఇప్పుడు సిట్ తనను కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
నిలదీస్తున్నందుకే నోటీసులు : హరీష్ రావు
కేటీఆర్‌కు సిట్ నోటీసులపై హరీశ్‌రావు స్పందించారు. నిన్న తనకు నోటీసు, ఇవాళ కేటీఆర్‌కు నోటీసు ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తున్నందుకే సిట్ విచారణ నోటీసులు జారీ చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ నోటీసులు, విచారణ తంతులు అని హరీష్ రావు విమర్శించారు. ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన మేం ప్రభుత్వాన్ని నిలదీస్తుంటామని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు భయపడబోమని, ఆయనను వదిలిపెట్టబోమని, వెంట పడుతామని హరీష్ రావు హెచ్చరించారు. మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కనుక ప్రజల మధ్య నిటారుగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.
వేగం పెంచిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును సిట్ విచారణ చేసింది. దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారణ చేశారు. ఈ కేసు దర్యాప్తుతో సంబంధమున్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని సిట్ అధికారులు ఆయనను ఆదేశించారు. ఈ కేసులో హరీశ్‌రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఆరోపణలపై 2024 మార్చి 10 నుంచి కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగపత్రాలు సైతం దాఖలయ్యాయి. సిట్ ఏర్పాటయ్యాక దర్యాప్తులో మరింత వేగం పెరిగింది.
మండిపడిన బీఆర్ఎస్
కేటీఆర్‌కు సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కారు నాటకం ఆడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్‌లగా దర్యాప్తు నడిపిస్తోందని అన్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకే సిట్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని బీఆర్ఎస్ నేత సోమభరత్ విమర్శించారు. కోర్టులు, చట్టంపై నమ్మకం ఉన్నందున చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాడు పనులు చేస్తోందని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ వేశారని ఆరోపించారు.


