ఉద్యమకారుల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు
వైరా–ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన
పలు కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం అందజేత
కాకతీయ, ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటుందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఇటీవల మృతి చెందిన ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ముందుగా కారేపల్లి మండలానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్లు మృతి నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి సతీమణి జడల వసంత, కుమారుడు జడల కళ్యాణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని ధైర్యం చెప్పిన నామ, వెంకటేశ్వర్లుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం కారేపల్లి మండలం గాదపాడు గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచెపల్లి కృష్ణారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ మెంటెం రామారావు మాతృమూర్తి శకుంతుల దశదిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. ఖమ్మం నగరంలో మోతుకూరి పుల్లయ్య కుటుంబాన్ని కూడా నామ పరామర్శించి భరోసా ఇచ్చారు.


