నగరం వెలిగిపోవాలె!
అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు
అధికారులకు మేయర్ గుండు సుధారాణి ఆదేశం
కాకతీయ, వరంగల్: వరంగల్ నగరం విద్యుత్ కాంతుల్లో వెలిగిపోవాలని, నగరంలోని అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి బల్దియా అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) పనుల పురోగతిపై తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత కౌన్సిల్ సమావేశంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇంకా టెండర్ పిలవని డివిజన్లకు వెంటనే టెండర్లు పిలవాలని, టెండర్ పూర్తైన చోట్ల లైట్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్, క్లాంపులు లేని స్తంభాల గుర్తింపు, అవసరమైన మెటీరియల్ కొనుగోలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహానగర వ్యాప్తంగా వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు మహేందర్, మాధవీలత, ఏఈలు సరిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


