అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్!
ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్
420 హామీలతో జనాలను మోసం చేసిన రేవంత్ సర్కారు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేటలో బీఆర్‌ఎస్ ప్రజా నిరసన
కాకతీయ, నర్సంపేట టౌన్ : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు రెండేళ్లయినా ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం ప్రజా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ… మార్పు పేరుతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు శిలాఫలకాల రాజకీయం చేస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల ప్రశ్నలను తప్పించుకోవడానికి గుర్తింపు లేని పనులకు పునాది రాళ్లు వేస్తూ కొత్త మోసాలకు తెరలేపుతోందని ఆరోపించారు. ఇవన్నీ నయా మోసం, నయా దగా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి ఆపిన ఘనత కాంగ్రెస్‌దే!
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేసీఆర్ నాయకత్వంలో నర్సంపేట అభివృద్ధికి ప్రతి అంగుళానికి నిధులు తెచ్చామని సుదర్శన్‌రెడ్డి గుర్తుచేశారు. మిషన్ భగీరథ, ఇంటర్నెట్, నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని కొనసాగించకుండా నిధులు పక్కన పెట్టిందని ఆరోపించారు. తాను తీసుకొచ్చిన నిధులకు కొత్త కాగితాలు పెట్టి శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై మండిపడ్డారు. పాకాల ఆడిటోరియం ఏసీ ఫంక్షన్ హాల్‌కు రూ.7 కోట్లతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ వెజ్–నాన్‌వెజ్ మార్కెట్, కుల సంఘాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు.
హామీల బాకీలు… మహిళలే బుద్ధి చెబుతారు
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి 25 నెలల బాకీ రూ.62,500 చెల్లించలేదని అన్నారు. రైతులు, విద్యార్థులు, పెళ్లైన అక్కచెల్లెలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ మోసాలన్నింటికీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా పోలీసులు ఒత్తిడి తెచ్చారని, బీఆర్‌ఎస్ నిషేధిత పార్టీ కాదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు, అక్రమ దందాలతో ప్రజల ప్రశాంతతను భంగం చేస్తోందని ఆరోపిస్తూ, నర్సంపేటలో కాంగ్రెస్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సరైన గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా విభాగం, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


