చెత్త డ్యూటీ!
వరంగల్ బల్దియాలో విధుల పట్ల నిర్లక్ష్యం
ఇష్టారాజ్యంగా పారిశుధ్య సిబ్బంది డ్యూటీ
పలువురు డ్రైవర్లు పనికిరాకుండా డుమ్మా
సేకరించిన చెత్తను డంప్యార్డుకు చేరవేయడంలో అలసత్వం
ట్రాన్స్ఫర్ స్టేషన్లలో లోడ్ వాహనాలను వదిలేసి వెళ్తున్న వైనం
లోడ్తో వాహనాలను వదిలేస్తే మరమ్మతులకు చేరుకోవా?
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థలో కింది స్థాయి సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ముఖ్యంగా పారిశుధ్య విభాగంలో డ్యూటీలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణ, తరలింపు బాధ్యతల్లో కీలకమైన వాహన డ్రైవర్ల అలసత్వం వల్ల వ్యవస్థే దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం హన్మకొండలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో రెండు వాహనాల నిండా చెత్తతో ఉన్న టిప్పర్, కాంపాక్టర్‌ను డ్రైవర్లు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. సాధారణంగా ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి చెత్తను రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలించి, ఖాళీ వాహనాలను తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ లోడుతోనే వాహనాలను వదిలేసి వెళ్లడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

వాహనాలు ఎవరివి కావా?
భారీ వాహనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే సరైన నిర్వహణ అత్యంత అవసరం. కానీ బల్దియాలో వాహనాల మెయింటెనెన్స్‌ను గాలికొదిలేసినట్లే పరిస్థితి కనిపిస్తోంది. హన్మకొండ బాలసముద్రంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో లోడుతోనే వాహనాలను గంటల తరబడి నిలిపివేయడం వల్ల టైర్లపై అధిక భారం పడుతుంది. తడిచెత్తతో వాహన బాడీకి తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది. ఇవన్నీ చివరకు వేలల్లో ఖర్చుతో మరమ్మతులకు దారి తీస్తాయన్న విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వాహనమంటే ఎవరిదో కాదన్న ధోరణితో వ్యవహరిస్తే నష్టమయ్యేది ప్రజాధనమేనన్న విషయాన్ని మరిచిపోవద్దని నగరవాసులు అంటున్నారు. నెలకో కొత్త వాహనం కొనడం పరిష్కారం కాదని, ఉన్న వాహనాలను జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

డ్రైవర్ల అలసత్వం హద్దులు దాటిందా?
బల్దియా వాహనాల డ్రైవర్లలో కొందరు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొత్తవి కావు. ప్రభుత్వ వాహనమనే అహంకారంతో ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్నారని, గతంలో ప్రమాదాలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. హన్మకొండ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో ర్యాంప్‌పై వాహనాలు ఎక్కించిన తర్వాత బ్రేక్‌ల విషయంలోనూ అలసత్వం చూపడం వల్ల కొన్ని సందర్భాల్లో వాహనాలు రివర్స్‌లో వేగంగా వచ్చి బోల్తాపడిన ఘటనలున్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాహనాలు మరమ్మతులకే పరిమితమయ్యే ప్రమాదంతో పాటు ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే బల్దియా వ్యవస్థపై మరింత విమర్శలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


