మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు – భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు
కాకతీయ, హనుమకొండ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వేయి స్తంభాల దేవాలయం పరిసరాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల భద్రతకు సీసీ కెమెరాలు, పటిష్ట పోలీస్ బందోబస్తు, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ అమలు చేయాలని ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి గతంతో పోలిస్తే మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లపై చర్యలు చేపడతామన్నారు. దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామల సునీత దర్శన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. వేయి స్తంభాల దేవాలయం ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, డీఆర్ఓ వైవి గణేష్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఏసీపీ నరసింహారావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


