ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు
విద్య–నీరు–సంక్షేమ రంగాలకు భారీగా నిధులు
ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ కాలేజీకి శ్రీకారం
తాగునీటి ప్లాంట్, ఎస్సీ వసతిగృహం నిర్మాణం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
మూడు శాఖల మంత్రులతో కలిసి శంకుస్థాపనలు
కాకతీయ, జగిత్యాల : ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించేలా రూ.229 కోట్ల వ్యయంతో కీలక మౌలిక వసతుల నిర్మాణాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం శ్రీకారం చుట్టారు. విద్య, శుద్ధ త్రాగునీరు, సంక్షేమ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యే రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ధర్మపురిలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఒకే ప్రాంగణంలో తరగతులు, హాస్టల్, ప్రయోగశాలలు, డైనింగ్ హాల్, క్రీడా సదుపాయాలతో ఈ పాఠశాల ఏర్పాటు కానుందని చెప్పారు. పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా రూ.10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణంతో విద్యార్థులకు శాశ్వత మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
శుద్ధ నీరు–సంక్షేమంతో జీవన ప్రమాణాలు
రైతు, విద్యార్థి కేంద్రంగా అభివృద్ధి
రూ.17 కోట్లతో ఎన్టీపీ శుద్ధ త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని, అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే రూ.2 కోట్లతో ఎస్సీ బాలుర వసతిగృహం నిర్మించడం ద్వారా పేద విద్యార్థులకు సురక్షితమైన వసతి, చదువుకు అనుకూల వాతావరణం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, నీరు, సంక్షేమ మౌలిక వసతులు బలోపేతం అయితే రైతు కుటుంబాల భవిష్యత్తు భద్రమవుతుందని అన్నారు. ధర్మపురిలో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామీణాభివృద్ధికి దిశానిర్దేశకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం అంటే కేవలం పథకాలు కాదని, అవకాశాలు కల్పించడమే అసలైన సంక్షేమమని అన్నారు. ఎస్సీ బాలుర వసతిగృహం నిర్మాణంతో విద్యార్థుల చదువులు మధ్యలో ఆగే పరిస్థితి ఉండదన్నారు. వసతిగృహాలు, విద్యా సంస్థలు, నీటి ప్రాజెక్టులు కలిసి గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ధర్మపురిలో ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు.


