బిల్లుల కోసం పాఠశాలకు తాళం
పనులు చేసి అప్పుల పాలయ్యామని కాంట్రాక్టర్ ఆవేదన
రెండేళ్లుగా చెల్లింపులు లేవని నిరసన
చిన్నవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
కాకతీయ, పెద్దవంగర : అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పనులు చేపడితే, రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్ బుధవారం నిరసనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ ప్రభుత్వ పాఠశాల ఎంట్రన్స్ గేటుకు తాళం వేశారు. 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ‘మన ఊరు–మన బడి’ పథకం కింద పాఠశాల మరమ్మతుల కోసం అప్పులు తెచ్చి పనులు పూర్తిచేశామని విద్య కమిటీ చైర్మన్ కొండ శ్రీను తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ బిల్లులు విడుదల కాలేదని వాపోయారు. పనుల కోసం తెచ్చిన అప్పులు తడిసి మోపెడయ్యాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తాళం వేయడంతో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరుబయటే నిరీక్షించాల్సి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయులు ఎంఈవో శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన ఆయన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ తాళం తీసేశారు.


