పార్టీలకతీతంగా సంక్షేమమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త ప్రణాళిక
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కల్యాణలక్ష్మి–సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కాకతీయ, గీసుగొండ : పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గీసుగొండ మండలం కొనాయిమాకుల రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలు, 15, 16 డివిజన్ల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 46 మంది లబ్ధిదారులకు రూ.46 లక్షల 5 వేల 336 విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులు, 35 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల 20 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం పెద్ద దన్నుగా నిలుస్తోందని అన్నారు.
డబ్బు రాజకీయాలతో నష్టమే
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన చేస్తూ, డబ్బులిచ్చే వారికే ఓట్లు వేయడం వల్ల ప్రజలే తమ భవిష్యత్తును దెబ్బతీసుకున్నట్లవుతుందని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేసే నాయకులను పక్కనబెట్టి డబ్బులకు ఆశపడితే సంక్షేమ పథకాలకు గండిపడుతుందని హెచ్చరించారు. వచ్చే సంవత్సరం నుంచి మండలంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పిల్లలు ఇంటి దూరంగా హాస్టళ్లలో చదువుకోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇంటి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఆకుల సర్పంచ్ వజ్రా రాజు, ఊకల్ సర్పంచ్ కక్కేర్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


