ల్యాండ్ పూలింగ్‌కు కుడా గ్రీన్ సిగ్నల్!
130 ఎకరాల అభివృద్ధికి భూయజమానుల ముందడుగు
ఆత్మకూరులో 21½ ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తి
మోడల్ లేఔట్ల అభివృద్ధిపై కుడా ఫోకస్
ఊనికిచర్ల వద్ద 145 ఎకరాల్లో ‘యూనిసిటీ’ ప్రాజెక్ట్
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లాలో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ఊపందుకుంది. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన భూయజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో మొత్తం 130 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడింది. భూముల అభివృద్ధిలో భాగస్వాములుగా మారేందుకు భూస్వాములు చూపుతున్న ఆసక్తితో కుడా ఆశావహంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలానికి చెందిన భూయజమానులు తమ స్వంత భూముల్లోని 21½ ఎకరాలను కుడాకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం గమనార్హం. భూయజమానుల ఈ చొరవను కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్‌పాయి అభినందించారు. భూస్వాముల సహకారంతో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయవచ్చని వారు పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యం
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వేగంగా మారుతున్న రియల్ ఎస్టేట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రణాళికాబద్ధమైన లేఔట్‌ల అభివృద్ధే కుడా ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న భూయజమానులు కుడాను సంప్రదిస్తే, అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన మోడల్ లేఔట్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పచ్చదనం వంటి సౌకర్యాలతో సమగ్ర అభివృద్ధికి కుడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ విధానం భూయజమానులకు కూడా లాభదాయకంగా మారుతుందని, అభివృద్ధి తర్వాత భూముల విలువ గణనీయంగా పెరుగుతుందని కుడా అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే విధానంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
యూనిసిటీ మోడల్ లేఔట్‌కు ఊపిరి
ఇదే సమయంలో వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలోని ఊనికిచర్ల ప్రాంతంలో మరో కీలక ప్రాజెక్ట్ కొనసాగుతోంది. లావుని పట్టాదారుల భాగస్వామ్యంతో 145 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ‘యూనిసిటీ మోడల్ లేఔట్’ను కుడా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నారు. అవసరమైన రోడ్లు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, భవిష్యత్తు పట్టణ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వ సంస్థలతో పాటు భూయజమానులు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం వల్ల పట్టణ విస్తరణ క్రమబద్ధంగా జరిగే అవకాశం ఉందని కుడా భావిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని భూయజమానులు ముందుకు వచ్చే అవకాశముందని, హనుమకొండ జిల్లాలో ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి ఇది కీలక మలుపుగా మారుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


