బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు
నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమివ్వాలి
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట : బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విమర్శలు చేస్తూనే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా అంగీకరిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే మాధవ రెడ్డి గ్రామగ్రామాన తిరిగి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడుతూ పాలన సాగిస్తారని నిలదీశారు.
బీఆర్‌ఎస్–కాంగ్రెస్ ఒకే బాట
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ – ఈ రెండు పార్టీలు నర్సంపేట ప్రజలకు ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ‘కాంగ్రెస్ నేతలు నిలువునా దోచుకుంటున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఆ ఆరోపణలు నిజమా కాదా చెప్పకుండా ‘మీరు చేసినప్పుడు ఏమైంది? మా దగ్గర కూడా ఆధారాలున్నాయి’ అంటూ మీడియా ముందు మాట్లాడటం చూస్తే, రెండు పార్టీల మధ్య దోపిడీపై అప్రకటిత ఒప్పందం ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఎందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘నువ్వు తినేది బయటికి చెప్పకు, నేను తినేది బయటికి చెప్పను’ అన్న ధోరణితోనే నర్సంపేట ప్రజలకు అన్యాయం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. అధికార దాహం ఎప్పటికీ తీరదని, ప్రజలను పట్టి పీడిస్తూ తమ కడుపు నింపుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న బీజేపీ నాయకులను గుర్తించి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి ఈ దోపిడీ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాలని రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహారాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షుడు తనుగుల అంబేద్కర్‌తో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ, యువమోర్చా, ఎస్టీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.


