తొర్రూరు అభివృద్ధే లక్ష్యం
కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు
మినీ ట్యాంక్ బండ్‌తో పెరిగిన పట్టణ సౌందర్యం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు అవసరం
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. ఆరు కోట్లు డెబ్బై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ధోబి ఘాట్, స్మశాన వాటిక, మైత్రి భవన్ కమ్యూనిటీ హాల్, పద్మశాలి, స్వామి వివేకానంద, గౌడ సంఘం, నాయి బ్రాహ్మణ, విశ్రాంత ఉద్యోగుల, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను స్థానిక నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆయా వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ శంకుస్థాపనలకే పరిమితం..!
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమై పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసి చూపించామని అన్నారు. తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని అందించేలా టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ. మూడు కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు సేదతీరే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే సుందరీకరణ పనులు పూర్తి చేసి తొర్రూరును అందమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మంచినీటి సమస్యకు పరిష్కారంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తొర్రూరును తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరో పదిహేను కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, పోనుగొట్టి సోమేశ్వరరావు, చాపల అనిత బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, నరసయ్య, మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగిలి ఉష పాల్గొన్నారు.


