సింగరేణిలో బొగ్గు కుంభకోణం
సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అనేక అక్రమాలు వెలుగులోకి
రేవంత్–బామ్మర్ది సృజన్ పాత్రపై ఆరోపణలు
టెండర్ నిబంధనల మార్పుతో వేల కోట్ల నష్టం
అంతర్గత విచారణ సరిపోదు… సీబీఐకే అప్పగించాలి
దర్యాప్తు కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హరీష్‌రావు లేఖ
సిట్‌కు వెళ్లే ముందే మీడియా సాక్షిగా లేఖ విడుదల
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ఈ కుంభకోణానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి *జి. కిషన్ రెడ్డి*కి లేఖ రాశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా ఆ లేఖను హరీశ్ రావు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. లేఖలో హరీశ్ రావు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్లకు “సైట్ విజిట్ సర్టిఫికేట్” అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని తెలిపారు. ఈ విధానం గతంలో సింగరేణిలో ఎప్పుడూ లేదని, దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థల్లో కూడా అమలులో లేదని గుర్తుచేశారు. ఈ నిబంధన ద్వారా ముందుగానే కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్లు మలచినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.
తక్కువ ధర టెండర్లు రద్దు… అధిక ధరలకు కట్టబెట్టడం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనస్ 7 నుంచి మైనస్ 20 శాతం వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో ప్లస్ 7 నుంచి ప్లస్ 10 శాతం వరకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. దీని వల్ల సింగరేణికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ మార్పులు ప్రజాధనానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని లేఖలో వివరించారు. డీజిల్ కొనుగోలు విధానంపై కూడా హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఐఓసిఎల్ నుంచి నేరుగా బల్క్ డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని నిలిపివేసి, కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, అదనంగా జీఎస్టీ భారం పడుతోందని, ఇది సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఎందుకు శాశ్వత సీఎండీ నియామకం జరగలేదు
గత రెండేళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీని నియమించకపోవడంపై హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. ఇన్‌చార్జ్ పాలనతో సంస్థ నడుస్తుండటంతో మానిటరింగ్ బలహీనమై, ఇష్టారాజ్య నిర్ణయాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు నిబంధనల ఉల్లంఘనలపై మౌనంగా ఉండటంపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ లేదా అంతర్గత విచారణలు సరిపోవని, 2024 తర్వాత తీసుకున్న అన్ని టెండర్లు, పాలసీ నిర్ణయాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని హరీశ్ రావు కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు.


