టికెట్ల ఇవ్వడానికి సర్వేలే ప్రామాణికం
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
ఆశావహుల మధ్య ఒప్పందం.. అంగీకారం
చెన్నూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ అధ్యక్షతన సమావేశం
సర్వే రిపోర్టుల ఆధారంగానే టికెట్లు కేటాయింపుపై స్పష్టత
టికెట్ల పంచాయితీలకు ‘ఫుల్‌స్టాప్’ పెట్టే ప్రయత్నం
కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఒక్కో వార్డులో పోటీ చేస్తున్న ఆశావహుల వివరాలను సేకరించిన కాంగ్రెస్, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి జరిగిన ఆశావహుల సమావేశంలో కీలక మార్గదర్శకాలు జారీ అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వార్డుల వారీగా నిర్వహిస్తున్న సర్వేలే టికెట్ల కేటాయింపుకు ప్రామాణికమని స్పష్టం చేసినట్లు సమాచారం. టికెట్ ఎవరికి వచ్చినా, అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం శ్రమించాలని ఆయన నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయతీలకు ఈ నిర్ణయంతో మంత్రి వివేక్ స్పష్టమైన ఫుల్‌స్టాప్ పెట్టినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మంగళవారం చెన్నూరు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ స్పీడ్
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సర్వేలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలాబలహీనతలను పరిశీలించి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 20 వార్డులకు పైగా అభ్యర్థులను ఖరారు చేసి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎలాగైనా మరోసారి క్యాతన్‌పల్లి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో నేతలు సమన్వయంగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అధికార కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా, లేక బీఆర్ఎస్‌తో జతకడతారా అన్నది తేలాల్సి ఉంది. పొత్తులో భాగంగా సీపీఐ ఎనిమిది స్థానాలు కోరగా, కాంగ్రెస్ మూడు స్థానాలకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు స్థానాలతో సీపీఐ పొత్తుకు సిద్ధమవుతుందా? లేక బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుందా? అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. మొత్తానికి క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి.


