వ్యవసాయంపై కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కే పరిమిమైన మానుకోట జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కాకతీయ, నర్సింహులపేట :
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గురించి, వ్యవసాయంపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం నర్సింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలన రైతులకు ఒక స్వర్ణ యుగమని, పది సంవత్సరాల పాలన కాలంలో ఎన్నడు కూడా యూరియా, విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడలేదని తెలిపారు. నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతో పాటు ముందు చూపు లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఢిల్లీకి కప్పాలు కట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టివుంటే రైతులకు ఈ ఇబ్బందులు తలెత్తేవి కాదని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ లు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు తప్పా ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతన్నలకు సకాలంలో యూరియా అందే విధంగా కృషి చేయాలన్నారు. మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన రిపోర్టర్ సలుగు నాగన్న మాతృమూర్తి సలుగు జయమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బాధితుడి నివాసానికి చేరుకొని జయమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.


