భూ భారతితో ప్రజలకు నరకం
భూ సమస్యలను పరిష్కరించని రేవంత్ సర్కారు
ఏళ్ల తరబడిగా పరిష్కారం కాకపోవడంతో రక్తసంబంధాలు తెగుతున్నాయి
లక్షల మంది బాధ… ప్రభుత్వానికి పట్టడం లేదు
పరిష్కరించామని ప్రభుత్వం చెబుతుంటే 70 లక్షల దరఖాస్తులెందుకు..?
ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
కాకతీయ, హైదరాబాద్ : భూ భారతితో ప్రజలకు నరకం కనిపిస్తోందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిని విమర్శించి కొత్త చట్టం తీసుకువచ్చిన రేవంత్ సర్కారు అమలులో విఫలమవుతోందని అన్నారు. భూ సమస్యలకు అసలు కారకులు ప్రభుత్వాన్ని నడిపే వారేనని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన‘భూభారతిపై రౌండ్ టేబుల్ సమావేశం’లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి ఉండడాన్ని సమాజంలో స్టేటస్‌గా భావిస్తామని, అదే భూమి కోసం రక్తసంబంధాలు కూడా ప్రాణాలు తీసుకున్న సందర్భాలు తాను చూశానని తెలిపారు. కానీ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఇది కొందరిది కాదు… లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్య అని స్పష్టం చేశారు.
70 లక్షల దరఖాస్తులెందుకు..?
భూసమస్యలు పరిష్కారమయ్యాయని కొందరు చెబుతున్నారని, అయితే అలాంటప్పుడు 70 లక్షల మంది ఎందుకు దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు “పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టయింది” అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో రోజూ ఇదే సమస్య తన దగ్గరకు వస్తోందన్నారు. 1984లో 150 గజాల స్థలం కొనుగోలు చేస్తే, 20 ఏళ్ల తర్వాత బ్రోకర్లు వచ్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని మూడు వేల మందిని ఇబ్బంది పెడుతున్న ఉదంతాలను ప్రస్తావించారు. “ఎవరు గెలిచినా ప్రభుత్వంలో మా వాళ్లే ఉంటారు… మాకేం చేయలేరు” అని అక్రమార్కులు ధైర్యంగా చెప్పుకుంటున్నారంటే చట్టాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.
చట్టాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి..?
చట్టాలు ఉంటాయని, కానీ ఆ చట్టం ఎవరి చేతుల్లో ఉందన్నదే అసలు సమస్య అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. లేకపోతే చట్టమే చట్టుబండలుగా మారుతుందన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దళితులకు ఎప్పుడో కేటాయించిన భూములను ఇప్పుడు గుంజుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే, భూమికోసం ఎన్నో ఏళ్లు పోరాడిన తెలంగాణలో ఎందుకు హక్కులు కల్పించడం లేదని ప్రశ్నించారు. దళితుల భూములకు విలువ పెరిగిందనే కారణంతో వాటిని లాక్కుంటున్నారని ఆరోపించారు. గజ్వేల్‌లో వేల ఎకరాల భూములు గుంజుకున్న ఘటనలను గుర్తు చేశారు. తెలంగాణలో భూమి కొనుక్కున్న వాడికి సుఖం లేదని వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్లో ఎన్నేళ్ల కింద కొనుగోలు చేసిన భూములను 118 జీవోతో హక్కులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దుర్మార్గాలకు ప్రభుత్వాలే కారణమని, పోరాటం చేయాల్సింది పాలకులపైనేనని స్పష్టం చేశారు. చట్టాన్ని దేవుడు చేయడని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే చేస్తుందని, ప్రభుత్వం సమస్యలను జటిలం చేయకుండా పరిష్కరించాలని హితవు పలికారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పేదలంటే, ప్రజలంటే భయం లేదని మండిపడ్డారు. ఈ సభ ద్వారా భూసమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఎలా కూలిందో, ఈ ప్రభుత్వం కూడా అలాగే కూలక తప్పదని ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు


