నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్
కాకతీయ, సినిమా డెస్క్ : తనను కాపాడటానికి ఎవరూ లేరని సినీ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్
పోస్ట్ పెట్టారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందిస్తూ అత్యంత భావోద్వేగంగా స్పందించారు. వీధి కుక్కలను చంపేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ విషయంలో తనను కొందరు విమర్శిస్తున్నారని.. అయితే ఎన్ని విమర్శలు చేసిన తాను మాత్రం పోరాటం ఆపనని మరోమారు రేణు దేశాయ్ స్పష్టంచేశారు. ‘‘నన్ను రక్షించడానికి తల్లిదండ్రులు గానీ, అన్నయ్య గానీ, భర్త గానీ ఎవరూ లేరు’’ అని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. జనవరి 19న హైదరాబాద్‌లో వీధి కుక్కల నివారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రేణు దేశాయ్ ఆవేశంగా మాట్లాడారు. కుక్కల కంటే దారుణంగా చిన్నారులపై అత్యాచారాలు చేసే మగాళ్లను ఎందుకు చంపడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్ తర్వాత నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. “నీకు తిక్క ఉంది.. అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశాడు” అంటూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కామెంట్స్ చేయడంపై ఆమె తీవ్రంగా కలత చెందారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, కేవలం మూగజీవాల ప్రాణాల కోసమే పోరాడుతున్నానని స్పష్టం చేశారు.


