పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి
బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్
వరంగల్ పరిధిలోని పార్క్ లలో క్షేత్ర స్థాయి పరిశీలనలు
సిఎన్ డి వ్యర్థాలు తొలగించనందుకు గృహ యజమానికి పెనాల్టీ
కాకతీయ, వరంగల్ : పార్క్ లు పరిశుభ్రంగా ఉంచాలని బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ హార్టికల్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ పార్క్, టెలికాం పార్క్, క్రిస్టియన్ కాలనీ పార్క్, టి ఆర్ టి పార్క్ లను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్క్ లను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు రోడ్డు నుండి ఎంజీఎం, ఎంజీఎం
నుండి పోచమ్మ మైదాన్, వెంకట్రామ జంక్షన్ వరకు మీడియన్ లను పరిశీలించి మీడియన్ లలోని గ్యాప్ లలో మొక్కలను నాటాలని అందులో ఉన్న కలుపు మొక్కలను (వీడ్) తొలగించాలని, ఏపుగా పెరిగిన మొక్కలను కత్తిరించి సుందరంగా రూపొందించాలని సూచించారు. టెలికాం పార్క్ సమీపంలో గృహనిర్మాణ వ్యర్థాలు (సిఎన్ డి) రోడ్డుపై వేయడాన్ని గమనించిన కమిషనర్ సదరు యజమానికి పెనాల్టీ వేయాలని ఆదేశించిన నేపధ్యంలో రూ.1500 జరిమాన విధించినట్లు శానిటేషన్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వస్కుల బాబు, హెచ్ఓ లక్ష్మారెడ్డి, సూపర్వైజర్ భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ భీమయ్య, హార్టికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


