అనిల్ అరుదైన ఘనత
కాకతీయ, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు ఒక సక్సెస్ బ్రాండ్‌గా మారిపోయింది. 11 ఏళ్ల కిందట పటాస్‌తో మొదలైన ఆయన జర్నీ పరాజయం అనేదే లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ బాగా వర్కౌట్ అవుతోంది. ఆయన ఇప్పటిదాకా తొమ్మిది సినిమాలు తెరకెక్కించారు. అందులో పొంగల్ బరిలో నిలిచిన ప్రతిసారీ హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే గతేడాది విక్టరీ వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బరిలో నిలిచారు. ఈ సినిమా భారీ విజయం అందుకొని లాంగ్ రన్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. తాజాగా చిరంజీవి హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కూడా సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ.292 కోట్ల వసూళ్లు సాధించింది. అలా అనిల్ ఒక ఏడాది వ్యవధిలోనే వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సంవత్సరాల్లో రూ.200 కోట్ల వసూల్ చేసిన సినిమాలు తెరకెక్కించిన ఏకైక తెలుగు దర్శకుడిగా అనిల్ అరుదైన ఘనత సాధించారు. టాలీవుడ్‌లో ఇంతకుముందు ఏ దర్శకుడి ఖాతాలో వరుస సంవత్సరాల్లో రూ.200 కోట్లు సాధించిన సినిమాలు లేవు.


