ఆటకు వీడ్కోలు పలికిన సైనా నెహ్వాల్
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న ఈ హైదరాబాద్ స్టార్.. తన రిటైర్మెంట్ విషయాన్ని ఖరారు చేసింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపింది. రిటైరవుతున్నట్లు లాంఛనంగా ప్రకటించడం అవసరమని తాను భావించలేదని పేర్కొంది. భారత మహిళల బ్యాడ్మింటన్‌లో ఎన్నో అత్యుత్తమ విజయాలు సాధించి మార్గదర్శిగా నిలిచిన సైనా నెహ్వా.. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘రెండేళ్ల కిందటే నేను ఆడటం మానేశా. నా అంతట నేను ఆటలోకి వచ్చా.. నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. అందుకే ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పడం అవసరం లేదనుకున్నా. ఇంకెంత మాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసనట్లే. మరేం పర్వాలేదు’అని సైనా చెప్పుకొచ్చింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి అత్యున్నత శిఖరాలకు చేరిన సైనా.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది.
గాయాలతో ఆటకు దూరం
2008లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తన సత్తాను ప్రపంచానికి చాటిన సైనా.. 2009లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సాధించింది. ఇండోనేసియా, సింగపూర్, స్విస్ ఓపెన్లలోనూ విజేతగా నిలిచింది. సైనా కెరీర్‌లో 10 సూపర్ సిరీస్, 10 గ్రాండ్‌ప్రి టైటిళ్లు ఉన్నాయి. 2014లో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2015లో ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అదే ఏడాది వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. 2017 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన సైనా.. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం అందుకుంది. సైనాను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్(2009), ఖేల్ రత్న(2010) అవార్డులతో సత్కరించింది. 2023లో చివరగా సైనా కోర్టులో కనిపించింది. ఆ తర్వాత గాయాలతో ఆటకు దూరమైంది.


