యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు
కావల్సిన యూరియా ప్రతీ రైతుకు అందిస్తాం ఆర్డీవో కృష్ణవేణి
కాకతీయ, బయ్యారం :
మండలంలోని గంధంపల్లి లో శ్రీదివ్య ఫర్టిలైజర్ షాపుల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా ప్రక్రియను గురువారం రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, డిపిఆర్ఓ రాజేంద్ర ప్రసాద్, స్థానిక తహశీల్దార్ సిహెచ్.నాగరాజు పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ఉన్న యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ కనుగుణంగా యూరియాను తెప్పిస్తామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు, డీలర్ల ద్వారా ప్రతి ఒక్కరికి యూరియాను సరఫరా చేయాలని సూచించినందున అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ రైతుకు యూరియా పంపిణీ చేయుటకు క్షేత్రస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు రామారావు, నాగరాజు, ఎస్ ఐ తిరుపతి, ఆర్ఐ సందీప్ , తదితరులు పాల్గొన్నారు.


