వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు
అధికార దాహంతో హద్దులు దాటుతున్నారు
రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు ఖండనీయం
కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్
కాకతీయ, దుగ్గొండి : రాజకీయాల్లో విలువలు, నైతికత రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని, ప్రజాస్వామ్య హోదాకు తగ్గట్లుగా విమర్శలు చేయాలి గానీ వ్యక్తిగత స్థాయికి దిగజారడం సిగ్గుచేటని వరంగల్ జిల్లా పరిషత్ మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలం గిర్నిబావిలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యుడు *పెద్ది సుదర్శన్ రెడ్డి*పై చేస్తున్న విమర్శలు హద్దులు దాటుతున్నాయని మండిపడ్డారు. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న మట్టి దందాలను సాక్ష్యాలతో సహా మీడియా ముందు ఉంచిన పెద్ది సుదర్శన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు పెండెం రామానంద్ చేసిన వ్యాఖ్యలను ఆకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగతంగా దూషించడం వేరని స్పష్టం చేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసే అధికార పార్టీ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
హోదాకు తగ్గ విమర్శలు చేయాలి
నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడిపై స్థాయిని మించి విమర్శలు చేయడం ఆందోళనకరమని, అధికార పార్టీ నాయకులు కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు తమ హోదాకు, స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శల వల్ల ఆయా పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలకు గాను కాంగ్రెస్ నాయకులు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆకుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సుఖినే రాజేశ్వర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పొన్నం మొగిలి, మాజీ వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు పెండ్యాల రాజు, కామిశెట్టి ప్రశాంత్, లావుడ్య చంద్రశేఖర్, జరుపుల భాస్కర్, రఘపతి రెడ్డి, నాయకులు యార మోహన్ రెడ్డి, పల్లాటి కేశవరెడ్డి, గుండెకారి రవి కుమార్, మడతలపాటి కుమార్, లాండే రమేష్ తదితరులు పాల్గొన్నారు.


