ఉచిత వైద్య సేవలు అభినందనీయం
ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న డిప్యూటీ సీఎం
కృష్ణరాజు కుటుంబ సేవాభావానికి ప్రశంసలు
కాకతీయ, ఖమ్మం : షుగర్ వ్యాధిగ్రస్తులకు లండన్ నుంచి ప్రత్యేక వైద్యులు వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప అవకాశమని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో యూకే స్వచ్ఛంద సంస్థ, కృష్ణరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కాళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్న విషయం చాలాసార్లు వారికి ముందుగా తెలియదని, సమగ్ర పరీక్షల ద్వారానే గుర్తించగలమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు వ్యాధి తీవ్రతకు ముందే జాగ్రత్తలు తీసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే సేవాభావంతో తన తండ్రి పేరిట కార్యక్రమాలు చేపడుతున్న ఆయన కుమార్తె *ప్రసీద*ను అభినందిస్తూ ఆశీర్వదించారు.
కృష్ణంరాజు కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న స్నేహబంధం కారణంగా మధిర నియోజకవర్గంలో పేదల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి వారు వెంటనే స్పందించి సేవలు అందించడం ప్రశంసనీయం అన్నారు. యునైటెడ్ కింగ్డమ్‌లో ప్రముఖ వైద్యుడైన డా. వేణు లండన్ నుంచి నేరుగా వచ్చి ఖర్చు లేకుండా చికిత్స అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విదేశాల్లో ఈ చికిత్సకు భారీ ఖర్చు అవుతుందని, అలాంటిది ఇక్కడే ఉచితంగా లభించడం పేదలకు వరమన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, సూర్య విక్రమాదిత్య, శ్యామలాదేవి, ప్రసీద తదితరులు పాల్గొన్నారు.


