కొండగట్టు వద్ద టవేరా బోల్తా.. 14 మందికి గాయాలు
కాకతీయ, కరీంనగర్ : కొండగట్టు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో టవేరా కారు అదుపు తప్పి కల్వర్ట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలు కాగా, వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారు హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


