రంగనాయక గుట్టల్లో జాతర ఏర్పాట్లు ప్రారంభం
సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, హుజురాబాద్ : ఈనెల 28 నుంచి జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు. పట్టణంలోని రంగనాయక గుట్టలలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను ఆయన జాతర కమిటీ సభ్యులతో కలిసి సందర్శించి జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు కండువాలు కప్పి ఏర్పాట్ల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మకు బంగారం చెల్లించి మొక్కులు అప్పజెప్పారు. వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాతర కమిటీ సభ్యులకు సూచించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కోరారు.


