కార్పొరేట్ శక్తులు డెమోక్రసీకి సవాల్!
ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం అవసరం
మత సెంటిమెంట్‌తో ఆర్థిక–సామాజిక అంశాలపై నుంచి దృష్టి మళ్లింపు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ ఛాలెంజ్
వామపక్షాల ఐక్యతతోనే అడ్డుకట్ట
తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి సందేశం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
సీపీఐ శతవసంతాల సందర్భంగా నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ప్రసంగం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మతం అనే సెంటిమెంట్‌ను ఆయుధంగా మార్చుకుని దేశంలోని ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తూ కార్పొరేట్, ఫాసిస్టు శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సవాల్ విసురుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సీపీఐ శతవసంతాల సందర్భంగా నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న కార్పొరేట్ శక్తులను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఫాసిస్టు భావజాలాన్ని ఐక్య పోరాటాల ద్వారానే అడ్డుకోవాలని వామపక్ష పార్టీలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దోపిడీ చేసే వర్గాలు–దోపిడీకి గురయ్యే వర్గాల మధ్య మాత్రమే కాకుండా, దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

భారత సమాజం కులాల ఆధారంగా నిర్మితం..
వర్గ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమని కార్ల్ మార్క్స్ చెప్పినప్పటికీ, భారత సమాజం వర్గాల కంటే కులాల ఆధారంగా నిర్మితమైందని జర్మన్ తత్వవేత్త మార్క్స్ వెబర్ స్పష్టం చేశారని భట్టి గుర్తు చేశారు. వర్గ పోరాటాన్ని నీరుగార్చే విధంగా వ్యవస్థ మారుతున్న ఈ సమయంలో, కమ్యూనిస్టుల పాత్ర దేశంలో మరింత కీలకమవుతుందని అన్నారు. ఖమ్మం జిల్లా అనేక భావజాలాలకు ఆతిథ్యమిచ్చే నేల అని, దేశవ్యాప్తంగా వామపక్ష నేతలు ఇక్కడ సమావేశమవడం గర్వకారణమని తెలిపారు. సీపీఐ 100 ఏళ్ల చరిత్రలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని, దేశ స్వాతంత్ర్య సాధనలో కమ్యూనిస్టులది ప్రముఖ పాత్ర అని గుర్తుచేశారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తిగా
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణకు ఒక సంవత్సరం తర్వాతే విముక్తి లభించిందని భట్టి తెలిపారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నడిపిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇచ్చిందన్నారు. భూమికోసం, భుక్తికోసం, పేదల విముక్తికోసం జరిగిన పోరాటాలు—‘దున్నేవానిదే భూమి’, గ్రంథాలయ ఉద్యమం వంటి ఉద్యమాలతో తెలంగాణ విలసిల్లిందని చెప్పారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రతి ఇంటికీ ఒక పోరాట గాధ ఉందన్నారు.
చట్టాలు–రాజ్యాంగ పరిరక్షణ
1950లో కౌలు గారి చట్టం, 1970 భూ సంస్కరణలు, 20 సూత్రాల పథకం, బ్యాంకుల జాతీయీకరణ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలు వామపక్షాల సహకారంతోనే సాధ్యమయ్యాయని భట్టి వివరించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, లేదంటే సామాన్యుడి హక్కులు హరించబడతాయని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటుహక్కును దెబ్బతీయడానికి, రాజ్యాంగ మార్పులకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.


