పసికందును అన్యాయంగా చంపేశారు!
డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ బంధువుల ఆరోపణ
గణేష్ నర్సింగ్ హోమ్‌లో ఘటన
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉమ్మనీరు మింగడంతో మృతి : డాక్టర్ బాసంతి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తొలి కాన్పుతో ఆనందంగా ఉన్న ఓ కుటుంబాన్ని విషాదం ముంచెత్తింది. పండంటి మగబిడ్డకు జన్మనిస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకం మిగిల్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గణేష్ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పసికందు చనిపోయిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ రాజు తండాకు చెందిన సుస్మిత–అశోక్ కుమార్లకు ఇది తొలి కాన్పు. గర్భధారణ మొదటి నుంచే సుస్మితను కొత్తగూడెంలోని గణేష్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించి వైద్య చికిత్సలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిరోజూ పరీక్షలు, స్కానింగ్‌లు చేసి పసికందు ఆరోగ్యం బాగుందని వైద్యురాలు భరోసా ఇచ్చిందని చెప్పారు.

డెలివరీ ఆలస్యం.. విషాదం
డెలివరీ తేదీగా సోమవారం నిర్ణయించడంతో ఉదయం 10 గంటలకే ఆసుపత్రికి వచ్చామని, అయినా సాయంత్రం వరకూ వేచి చూడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరకు డెలివరీ చేసినప్పుడు పుట్టిన ఐదు నిమిషాలకే పసికందు మృతి చెందాడని, ఇది పూర్తిగా డాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వైద్యరంగంలో అనుభవం ఉన్న డాక్టర్ ఇలాంటి నిర్లక్ష్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఉమ్మనీరు మింగడంతో మృతి : డాక్టర్ బాసంతి
ఈ ఘటనపై గైనకాలజిస్ట్ డాక్టర్ బాసంతి స్పందించారు. సుస్మితను ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశామని, అప్పటికే పసికందు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపారు. పుట్టిన మగశిశువు ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్)తో పాటు మలాన్ని మింగడంతో పేగులకు అడ్డుపడి, ఊపిరితిత్తులు గట్టిగా మారి శ్వాసకోస సమస్యలు తలెత్తాయని చెప్పారు. అదే కారణంగా పసికందు మృతి చెందినట్లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణను తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. పసికందు మృతి తర్వాత వైద్యురాలు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చిందని, కావాలనే తమ బిడ్డను చంపేశారంటూ వారు కన్నీరు మున్నీరు అయ్యారు. తొలి కాన్పులోనే గర్భశోకం మిగిలిన ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో, బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.


