చిక్కుల్లో నాగరాజు
వర్ధన్నపేట ఎమ్మెల్యేపై జనాగ్రహం
నిత్యకృత్యంగా మారుతున్న నిలదీతలు, నిరసనలు
హామీల అమలుపై అడుగడుగునా ప్రశ్నలు
సొంత పార్టీ నేతల నుంచీ సహాయ నిరాకరణ
నియోజకర్గంలోనూ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు
వివాదాస్పదంగా మారుతున్న ఎమ్మెల్యే నిర్ణయాలు
రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర నష్టం ?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారుతున్న వర్ధన్నపేట రాజకీయం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిలదీతలు, నిరసనలు నిత్యకృత్యంగా మారాయి. అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతుండంతో సొంత నియోజకర్గంలోనూ స్వేచ్ఛగా తిరుగలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. హామీల అమలులో విఫలమమతున్నారనే ఆరోపణలతోపాటు ఎమ్మెల్యే తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదంగా మారుతుండటంతో విమర్శల పాలవుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా మహిళలు, రైతులు, యువకుల నుంచే గాక సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసనలు వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమలుకాని సంక్షేమ పథకాలు, హామీల ఎగవేతపై రోజుకో చోట ప్రజలు ప్రశ్నలను సంధిస్తూ సమస్యలను ఏకరువు పెడుతుండటం కలవరపెడుతున్నది. నిరసన గళం రోజురోజుకూ తారస్థాయికి చేరుతుండటంతో ఎమ్మెల్యే నాగరాజు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యే నాగరాజుపై ఉన్న వ్యతిరేకత రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వరుస పరిణామాలు వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైనా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి
ఎమ్మెల్యే నాగరాజుకు ఇటీవల వరుసగా నిరసన సెగ తాకుతోంది. రెండు నెలల కింద ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీపై ఐనవోలులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును స్థానికులు ప్రశ్నించడంతో అసహనంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన నాగరాజును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. గెలిచినప్పటి నుండి గ్రామానికి నిధులు కేటాయించలేదని, అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించడానికే తాను వచ్చానని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో చేసేదేంలేక గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14 డివిజన్ పర్యటనను మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. అదేవిధంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును మహిళలు నిలదీశారు. పింఛన్లు రావడంలేదని, ఇండ్ల మంజూరులో పారదర్శకత లోపించిందని, గ్యాస్ కనెక్షన్‌ల సబ్సిడీలు అందలేదని, రుణమాఫీ రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాయకులు, కార్యకర్తలను పట్టించుకోరా ?
ఐనవోలు మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. మండలవ్యాప్తంగా 470 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, 336 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. ఐనవోలులో 60 మంది లబ్ధిదారుల్లో 37 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. కాగా ఐనవోలుకు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశం ముగించుకొని వెళ్తున్న ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులకు కాకుండా పక్కా ఇండ్లు, భూములు, ఆస్తులున్న వారి పేర్లు ఇండ్ల జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.
దవాఖాన తరలింపుపై ఆగ్రహం
తాజాగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రి కూడా ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. నియోజకవర్గ కేంద్రంలోనే దవాఖాన నిర్మించాలంటూ ఆస్పత్రి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 100 పడకల ఆస్పత్రిని పట్టణంలోనే నిర్మించడం అత్యవసరమని.. మరోప్రాంతానికి తరలించాలనే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే నాగరాజు హాజరుకాగా.. మహిళలు నిలదీశారు. వర్ధన్నపేటలో ఏం అభివృద్ధి చేశారని, ఉన్న ఆస్పత్రిని వేరే దగ్గరకు తరలించడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళం నెలకొంది. వర్ధన్నపేట నియోజకర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.


