చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..
45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
జపాన్ క్రీడాకారిణి కిమికో రికార్డ్‌ను బద్దలు కొట్టిన ఘనత
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే సింగిల్స్ ఆడిన అత్యంత పెద్ద వయసున్న మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 45 ఏళ్ల వయసులో ఆమె ఈ టోర్నీ ఆడి ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలో ఆమె జపాన్‌కు చెందిన కిమికో డేట్ (44 ఏళ్లు) రికార్డ్‌ను బద్దలు కొట్టింది. వీనస్ విలియమ్స్ ర్యాంక్ 576 కాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీలో ఆడింది. మహిళల సింగిల్ తొలి రౌండ్ మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ 7 6, 3 6, 4 6 తేడాతో సెర్బియాకు చెందిన ఓల్గా డానిలోవిచ్ చేతిలో ఓటమిపాలైంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ను వీనస్ విలియమ్స్ తృటిలో చేజార్చుకుంది. తొలి సెట్ గెలిచిన ఆమె రెండో సెట్‌లో ఓటమిపాలైంది. మూడో సెట్‌లో 4 0తో ఆధిక్యంలో నిలిచి ఆధిపత్యం చెలాయించింది. కానీ ప్రత్యర్థి ఓల్గా పుంజుకొని వీనస్ విలియమ్స్‌ను మట్టికరిపించింది. 1998లో 17 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి అరంగేట్రం చేసిన వీనస్ విలియమ్స్.. తొలి టోర్నీలోనే క్వార్టర్స్‌కు చేరుకుంది. గత 28 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా.. టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2003, 2017లో ఫైనల్ చేరినప్పటికీ.. తన సోదరి సెరెనా విలియమ్స్ చేతిలో ఖంగుతిన్నది. తాజా ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో వీనస్ సింగిల్స్‌లో ఓడిపోయినప్పటికీ.. ఎకటెరినా అలెక్సాండ్రోవాతో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడుతుంది.


