గంభీర్.. నీకో దండం!
టీమిండియాను వదిలేయ్!
భారత్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్
హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్
గంభీర్‌పై భారత అభిమానుల ఆగ్రహం
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీమిండియాకు అందించిన సేవలు చాలని, జట్టు నుంచి తప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ సెంచరీ, నితీష్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఈ ఘోర పరాజయం నేపథ్యంలోనే గంభీర్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హెడ్ కోచ్‌గా అతని వ్యూహాలు, నిర్ణయాలు, జట్టు ఎంపిక సరిగ్గా లేదని విమర్శిస్తున్నారు. గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి జట్లపై కూడా విజయం సాధించకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఘోర ఓటములు చవిచూసిందని గుర్తు చేస్తున్నారు.
శ్రీలంక పర్యటనలో ..
శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోవడం, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ కావడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి, సౌతాఫ్రికా చేతిలో టెస్ట్‌ల్లో క్లీన్ స్వీప్.. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఓటమి వంటి ఘోర పరాజయాలు ఎదురయ్యాయని నెటిజన్లు మండిపడుతున్నారు. టీమిండియా మళ్లీ ఐదు నెలల తర్వాతే వన్డే మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలై 14న బర్మింగ్ హామ్ వేదికగా తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ఫోకస్ అంతా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్ మీదే ఉంది. అలాగే జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్లో గనక ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం.. కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఫలితం, టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ప్రదర్శనపైనే గంభీర్ భవితవ్యంపై ఆధారపడి ఉంది.


