యువతలో మార్పే ప్రమాదాలకు మందు
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దు
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై చిర్ర రమేష్ బాబు
కాకతీయ, నెల్లికుదురు : మద్యం సేవించి వాహనం నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు పిలుపునిచ్చారు. నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో డ్రైవింగ్, రోడ్డు భద్రత అంశాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మద్యం సేవించి వాహనం నడపడం కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదకర అలవాటని, చిన్న నిర్లక్ష్యమే జీవితాంతం నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువతలో ముందుగా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అతివేగం, ట్రాఫిక్ సంకేతాల ఉల్లంఘన వంటి అంశాలు తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మరుసకట్ల అనిల్ కుమార్ పాల్గొని హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.


