రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
మానవ నిర్లక్ష్యమే ప్రమాదాలకు మూలం
‘అరైవ్ అలైవ్’తో అవగాహన ఉద్యమం
ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి
కాకతీయ, రఘునాథపాలెం : రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే ప్రమాదాలను నియంత్రించగలమని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, హెల్మెట్–సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం ప్రధాన కారణాలన్నారు. శిక్షలతో పాటు అవగాహన అవసరమని భావించి ఈ కార్యక్రమాన్ని పది రోజుల ప్రణాళికతో నిరంతరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, మార్కెట్లతో పాటు దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మార్పుకు నాంది యువతేనని పేర్కొంటూ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల కుటుంబాలు, గాయపడిన బాధితులతో నేరుగా మాట్లాడటం ద్వారా ప్రజల్లో బాధ్యత భావం పెరుగుతోందన్నారు. రోడ్డు భద్రత పోలీసుల ఒక్కరి బాధ్యత కాదని, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, డ్రైవర్లు, రైతులు, వ్యాపారులు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములైతేనే విజయమని తెలిపారు. ‘అరైవ్ అలైవ్’ను ప్రజా ఉద్యమంగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.


