ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు
అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచనలు
కాకతీయ, ఖమ్మం : ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని, ప్రతి అర్జీపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందేశం తయారీ నిమిత్తం, ప్రతి శాఖ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను క్లుప్తంగా అందించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. శాఖల పనితీరు స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు.
పాఠశాలపై ఫిర్యాదు.. విద్యాశాఖకు ఆదేశాలు
ఏన్కూరు మండలానికి చెందిన మంగిలాల్ ఓం ఆదిత్య గాయత్రి పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని ఒక బాధితుడు అర్జీ సమర్పించారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


