పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి
ఖమ్మంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
కాకతీయ, ఖమ్మం : విద్యార్థి లోకాన్ని చైతన్య వెలుగుల వైపు నడిపించేందుకు, సమతా–మమతల కోసం పోరాడే వేదికగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలను ఈ నెల 23 నుంచి ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. సోమవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వి. మనోహర్ రాజు, పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వి మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన పిడిఎస్ యూ విద్యార్థుల్లో విజ్ఞాన క్రాంతిని నింపిందన్నారు. సిలబస్ మార్పుల పేరుతో మతోన్మాద పాసిజాన్ని రుద్దే ప్రయత్నాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, శాస్త్రీయ విద్య పరిరక్షణ కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 23న మధ్యాహ్నం జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు విద్యార్థి ప్రదర్శన, భక్తరందాసు కళాక్షేత్రంలో బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. 24, 25 తేదీల్లో విద్యావేత్తల ప్రసంగాలు జరగనున్నాయని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు పెద్దఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


