కార్పొరేషన్ ఎన్నికల్లో “కారు” స్పీడ్ పెంచాలి
కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు చేర్చాలి
పనితనాన్ని బట్టే ప్రజలు పట్టం కడుతారు
కార్పొరేషన్ ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం
కార్యకర్తల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు
కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా
కొత్తగూడెం, కాకతీయ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై ప్రజలను నయవంచన చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ వైఫల్యాలను ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి వార్డులో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఈ బాకీ కార్డును ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను సవాలుగా తీసుకొని సమయాన్ని వృథా చేయకుండా శక్తి వంచన లేకుండా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

కార్పొరేషన్ ఎన్నికలే అసలైన పరీక్ష
కార్పొరేషన్‌లో ‘కారు’ స్పీడును పెంచి కార్పొరేషన్‌ను కైవసం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి *కె. చంద్రశేఖర్ రావు*కు కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని నేతలు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చెందిన సర్పంచులను గెలిపించడంలో కింది స్థాయి క్యాడర్ కష్టపడ్డ తీరు పార్టీపై నమ్మకాన్ని మరింత పెంచిందని అన్నారు. అదే స్ఫూర్తితో కార్పొరేషన్ ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకొని వారి సలహాలు, సూచనలతో వ్యూహాత్మకంగా ముందుకు సాగి బీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఫామ్ ఇచ్చే బాధ్యత పూర్తిగా పార్టీదేనని, ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రమేయం ఉండదని నేతలు స్పష్టం చేశారు. ‘నీ–నా’ భేదాలు వదిలి ప్రజల్లో మంచి పేరు, పలుకుబడి ఉన్న నాయకుడినే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని చెప్పారు. బీఫామ్ పొందే వ్యక్తి పనితనం, ప్రజల్లో ఉన్న గుర్తింపే ప్రామాణికమని తెలిపారు. ఇక నుంచి కార్పొరేషన్‌లో ఫోటోలు పంచాయతీలకు తావు ఉండదని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం ఖాయం
ఇటీవల ఖమ్మంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన మాటల తీరును హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బీఆర్ఎస్ దిమ్మలను తొలగించాలని బహిరంగంగా పిలుపునివ్వడం రౌడీయిజాన్ని ప్రోత్సహించడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, బీఆర్ఎస్‌కు పూర్వ వైభవం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 40 శాతానికి పైగా విజయం లభించిందని, అదే ఉత్సాహంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్పొరేషన్ డివిజన్ల వారీగా బీఆర్ఎస్ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దాము, సీనియర్ నాయకులు కాంపల్లి కనకేష్, రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, చందు నాయక్, సింధు తపస్వి తదితరులు పాల్గొన్నారు.


