రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్
మడికొండలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం
కాకతీయ, మడికొండ : గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం, జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మడికొండ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మడికొండ సెంటర్, ఓఆర్ఆర్ ఎలకుర్తి క్రాస్ రోడ్, ఓఆర్ఆర్ ధర్మసాగర్ అప్రోచ్ రోడ్లు, బట్టుపల్లి చింతలు వంటి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను సమావేశానికి ఆహ్వానించి వారి మనోవేదనను ప్రజల ముందుంచారు. “ఒకరి మరణం అంటే ఒక్క వ్యక్తిని కోల్పోవడం కాదు… ఒక కుటుంబం రోడ్డుపై పడటమే” అని ఇన్‌స్పెక్టర్ కిషన్ పేర్కొన్నారు. 20–40 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ప్రమాదాలకు బలవుతున్నారని, హెల్మెట్ లేకపోవడం, అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం ప్రధాన కారణాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, వాహన తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో రోడ్డు భద్రత పాటిస్తామని ప్రమాణం చేయించి, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.


