కనీస వేతనాలకు పూర్తి రక్షణ
వీబీ జీ రామ్ జీ చట్టంతో ఉపాధికి ఊతం
కాంగ్రెస్ అపోహలు సృష్టిస్తోంది
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : వీబీ–జీ రామ్ జీ చట్టం ద్వారా గ్రామీణ ఉపాధికి మరింత బలం చేకూరుతుందని, కనీస వేతనాలకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ కుమార్ బోనేటి స్పష్టం చేశారు. ఈ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీబీ జీ రామ్ జీ చట్టం–2025 అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చట్టం కీలకంగా నిలుస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా ఎంజీఎన్ఆర్జీఏను బలహీనపరచడం కాదని ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం చెల్లించే నిబంధనలను మరింత పటిష్టం చేశామని వివరించారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను గ్రామపంచాయతీలు, గ్రామసభలే రూపొందిస్తాయని పనుల అమలులో స్థానిక సంస్థలకే ప్రధాన బాధ్యత ఉంటుందని తెలిపారు. కనీసం 50 శాతం పనులు గ్రామపంచాయతీల ద్వారానే చేపట్టడం వల్ల స్థానికులకు ఉపాధి లభించి గ్రామాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే ఈ చట్టంపై కాంగ్రెస్ కావాలనే అపోహలు సృష్టిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి తప్పుదారి పట్టించే ప్రచారాలను నమ్మవద్దని అయన తెలిపారు.


