మా భూములు మాకేనని..
22/ఏ నిషేధానికి వ్యతిరేకంగా భూబాధితుల ఆందోళన
శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో ఐక్య సమావేశం
సమస్యకు పరిష్కారం లభించే వరకు పోరాటం ఆగదని స్పష్టం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పరిధిలోని రేకుర్తి, శ్రీరామ్‌నగర్ కాలనీ, కొత్త యాస్వాడ, ఆదిత్యానగర్, సాలేనగర్, విధ్యానగర్ ప్రాంతాలకు చెందిన భూముల యజమానులు తమ పట్టా భూములను ప్రభుత్వ నిషేధిత జాబితా (22/ఏ)లో చేర్చడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలో భారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ చట్టబద్ధంగా ఉన్న పట్టా భూములను వివరణ లేకుండా 22/ఏ పరిధిలోకి తీసుకువచ్చి తమ హక్కులను హరించారని ఆరోపించారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు ఉద్యమాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ కాలనీలకు చెందిన సుమారు 80 మంది పాల్గొన్నారు.


