పార్టీ మారట్లేదు
బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా
ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే..
కాంగ్రెస్‌లో చేరిక పూర్తిగా అవాస్తవం
మాజీ కార్పొరేటర్ మాధవి కృష్ణ గౌడ్
కాకతీయ, కరీంనగర్ : తాను పార్టీ మారినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని కరీంనగర్ నగరంలోని రేకుర్తి డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేందర్ రావు తమ నివాసానికి వచ్చినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన అతిథిని మర్యాదతో ఆహ్వానించి శాలువాతో సత్కరించామని అయితే ఆ సమయంలో వారి వెంట తెచ్చిన కాంగ్రెస్ కండువాలను తమకు కప్పారని పేర్కొన్నారు. వెంటనే ఆ కండువాలను తొలగించామని తెలిపారు. ఆ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిట్టని వ్యక్తులు ఫోటోలు తీసి మీడియాకు అందించారని ఆరోపించారు. దాంతో తమకు తీవ్ర మనస్తాపం కలిగిందని అందుకే ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. గతంలో రేకుర్తి డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో రేకుర్తి డివిజన్‌ను కరీంనగర్‌కు దీటుగా అభివృద్ధి చేశామని తెలిపారు. అలాంటి పరిస్థితిలో పార్టీని విడిచిపోవడం అనే ప్రశ్నే లేదని ఇది పూర్తిగా కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్ర మాత్రమేనని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


