ఎన్టీఆర్‌కు బీఆర్ఎస్ నేతల ఘన నివాళి
కాకతీయ, జూలూరుపాడు : నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలో ఎన్టీఆర్ అభిమానులతో కలిసి చర్చ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు పాల్గొని జోహార్లు తెలిపారు. యల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూ— మహానటుడిగా, ప్రజానాయకుడిగా ప్రజల మనసులు గెలిచిన అపూర్వ వ్యక్తిత్వం ఎన్టీఆర్ అని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడిగా ఆయనను కొనియాడారు. లకావత్ గిరిబాబు మాట్లాడుతూ— ప్రజాహిత పాలన, సంక్షేమ పథకాలతో పాటు తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో ప్రతిష్ఠించిన దార్శనిక నేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవ మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, సర్పంచ్ అంగోత్ రామారావు తదితరులు పాల్గొన్నారు.


