పేదలకు నాణ్యమైన విద్య, వైద్యమే లక్ష్యం
విద్య–వైద్య రంగాలే ప్రజా ప్రభుత్వానికి పునాది
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాల దిశగా అడుగులు
జపనీస్, జర్మన్ భాషల బోధనకు చర్యలు
ఖమ్మం జిల్లా పర్యటనలో ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఎదులాపురంలో రూ.108.60కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు భూమి పూజ
కూసుమంచిలో రూ.45.50 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
రూ.162.54కోట్లతో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ–హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘన స్వాగతం పలికారు.
వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో రూ.108 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నూతన భవనాలకు సీఎం భూమి పూజ నిర్వహించారు. కూసుమంచిలో రూ.45 కోట్ల 50 లక్షలతో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి, రూ.162 కోట్ల 54 లక్షలతో మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను, మద్దులపల్లిలో రూ.19 కోట్ల 90 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం ప్రారంభించారు.
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ అవకాశాలు
నర్సింగ్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, విద్య–వైద్యం ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వైద్య రంగంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీస్తుందని పేర్కొంటూ, నర్సులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు మంచి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. గతంలో ఇంజనీరింగ్ రంగానికే ఎక్కువ అవకాశాలుండగా, ఇప్పుడు పరిస్థితులు మారి వైద్య రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు.
జపాన్, జర్మనీతో ఒప్పందాలు
జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా పర్యటనల్లో ఆయా దేశాల్లో లక్షల సంఖ్యలో నర్సుల కొరత ఉన్నట్టు గుర్తించామని సీఎం చెప్పారు. జపాన్‌లో ఏజింగ్ సమస్య తీవ్రంగా ఉండటంతో మన నర్సింగ్ విద్యార్థులకు అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకంటే ఎక్కువ జీతభత్యాలు లభించే అవకాశాలున్నాయని తెలిపారు. అందుకే నర్సింగ్ కళాశాలల్లో జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం ఆయా దేశాల ప్రభుత్వాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. నర్సింగ్ విద్యార్థులు భవిష్యత్తులో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిధులు మంజూరు చేసి నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేశామని, విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వసతులు కల్పించామని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, నర్సింగ్ కళాశాలతో పాటు హాస్టల్ భవనాలను ఆధునాతన సాంకేతికతతో నిర్మించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


