తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డిపై వేటు
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ముగిసిన అనంతరం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9వరకు ఆతిథ్య ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళల వన్డే, టీ20 జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. ఈ రెండు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్న హైదరాబాద్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డిపై వేటు పడింది. వన్డే జట్టులో చోటు కోల్పోయిన అరుంధతి రెడ్డి.. టీ20 టీమ్‌లో మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి మాత్రం రెండు జట్లలో చోటు దక్కించుకుంది.
టీ20ల్లో గణాంకాలు
లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ తొలిసారి టీమిండియా వన్డే జట్టుకు ఎంపికవ్వగా.. ఆరేళ్ల తర్వాత భార్తి ఫుల్మానీకి టీ 20 ఫార్మాట్‌లో అవకాశం దక్కింది. 2019 నుంచి ఆమె భారత జట్టుకు దూరంగా ఉంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో మెరుగ్గా రాణించడంతో సెలెక్టర్లు ఆమెను తిరిగి భారత జట్టులోకి తీసుకున్నారు. గత సీజన్‌లో కూడా ఆమె మెరుగ్గానే రాణించింది. స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్.. వన్డే టీమ్‌లో చోటు నిలబెట్టుకోగా.. టీ20 టీమ్‌లో మాత్రం చోటు కోల్పోయింది. టీ20ల్లో హర్లీన్ డియోల్ గణంకాలు అంత గొప్పగా లేవు. ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె 17.27 సగటుతో 311 పరుగులు చేసింది. 17 ఏళ్ల వికెట్ కీపర్ జీ కమలిని కూడా తొలిసారి వన్డే టీమ్ పిలుపును అందుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జట్టుకు దూరంగా ఉన్న శ్రేయాంక పాటిల్ తిరిగి టీ20 జట్టులో చోటు దక్కించుకుంది.


