తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్!
రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి
దేశానికి తెలుగు జాతి ఘనతను చాటిన మహానాయకుడు
రెండు రూపాయల బియ్యం పథకంతో పేదల గుండెల్లో స్థానం
డ్వాక్రాలు, వృద్ధుల పెన్షన్‌తో సామాజిక మార్పు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి
కాకతీయ, హనుమకొండ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయనను తెలుగు జాతి గర్వకారణంగా కొనియాడారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ నలుమూలల తెలుగు ప్రజల ఘనతను గర్వంగా చాటిన మహానుభావుడని ఎర్రబెల్లి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.
రైతు–పేదల జీవితాల్లో వెలుగులు
రైతుల కోసం రుణమాఫీ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, నూతన మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనను ప్రజల దాకా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన పథకం ఆయనను పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని వ్యాఖ్యానించారు.
ఒక వ్యక్తి కాదు… ఒక యుగం
ఎన్టీఆర్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక యుగమని, ఒక చైతన్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతికి జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన నాయకుడిగా, రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ధైర్యశాలిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్ స్ఫూర్తే కారణమని, ఆయనే తన మార్గదర్శకులు, గురువని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ‘‘నేను నమ్మే ముఖ్యమంత్రులు ఇద్దరే… ఒకరు ఎన్టీఆర్, మరొకరు కేసీఆర్’’ అని పేర్కొంటూ, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా తారాస్థాయిలో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


